నమ్మాలి...
టన్నుల కొద్దీ నమ్మకాన్ని
గుండెల నిండా నిపుకుని
బ్రతకాలి.
ఎడారిలో దాహానికి
ఎండమావి ఎదురైనా
మేఘాన్నైనా నమ్మాలి.
అది దూదిపింజలా తేలిపోయినా
రణరంగంలో కర్ణుడి
రధచక్రంలా నమ్మకం
అప్పుడప్పుడూ క్రుంగిపోయినా
జీవన సమరంలో తుదివిజయం
మనదేనని నమ్మాలి.
న్యాయమేనా అన్న ప్రశ్నకు
దేవదేవుడి చిద్విలాసం
బలి తలలా
నమ్మకాన్ని పాతాళానికి తోక్కేస్తున్నా
ఏమూలో మిగిలి ఉన్న నమ్మకాన్ని
కళ్ళలోకి పోదిచేసుకుని
లోకాన్ని చూడాలి.
గుడ్డివాడికి కుడా
అద్భుత సోయగాలను చూపగలిగే
సంజీవిని గదా నమ్మకం.
నమ్మకాన్ని నమ్మకంగా నమ్మక తప్పని
నమ్మకం కదా జీవితం.
అందుకే నమ్మాలి...
తనివి తీరా నమ్మాలి...
నమ్మకమే జీవితమని నమ్మాలి...!
No comments:
Post a Comment