2.20.2015

కప్పుకున్న శరీరాన్ని
కట్టుకున్న సమాధినీ
మొనాటనీ‍ని
అనాటమీని
విజ్ఞానంతోనో
అజ్ఞానంతోనో
తవ్వుతున్నాను.
వెక్కిరించకు న‍న్ను
విశే‍షాలో
అవశే‍షాలో
ఆవిష్కరిస్తాను.
దేహాలతో
జ్వలించి జ్వలించీ
పదాలతో
ధ్వనించి ధ్వనించీ
కాలసాగరంలో
స్ఖలించిన
'భావ'ప్రాప్తి
తరంగాలను
వెలికితీస్తాను.
వేచివుండు నాకోసం
పాత రాతియుగాన్ని
దాటుతున్నాను.
ఆకలి కోరిక
మహా జాఢ్యమై
మనిషిని వెేదించని
ఆదిమ మతాన్ని
కనుగొన్నాను.
పకృతి ధర్మాన్ని
అణుమాత్రమైనా తప్పని
జన్యుదేవతల
అస్తిపంజరాల ఆస్తి
మద్య నేను‍న్నాను.
ఉండుండు
ఇంకా తవ్వుతూనే వున్నాను
మాన్యమైన ప్రపంచం
శూన్యమైన
అధిభౌతిక స్థితిని
నేకనుగొన్నాను.
వస్తావా నాకోసం
వస్త్రాలు వీడి
విహరిద్దాం.
దేహాలు వీడి
రమిద్దాం.

కాలేజీ నుంచి పట్టాలనే కాదు
కోటి కలలనీ మూటగట్టుకొచ్చిన వాళ్ళం
బతుకంటే బతుకుదెరువన్న అర్థంతో
ప్రపంచం లోకి ప్రవేశంచిన వాళ్ళం
కాళ్ళ మీద నిలబడడమంటే
నాలుగు రాళ్ళు వెనకేసుకోవడమని
తెలుసుకున్న వాళ్ళం
నిఘంటువులోని అర్థాలన్నింటినీ
రూపాయితో మారకం వేసి అమ్మిన వాళ్ళం
పదాలతో
పెదాలలో
స్థంభించిన కలల్ని ఎప్పుడో
స్ఖలించిన వాళ్ళం
రెండు కళ్ళూ
రెండు కాళ్ళూ
మార్కెట్ సూచీలకు ఆనించిన మనుషులం
థూత్తెరీ. . . . .
నాలుగు కాళ్ళూ నేలమీద
ఆనించిన గాడిదలే నయం.

క్రిష్ణా బచావో


గుండెలవిసేలా అరవండి
గుండెలదిరేలా నినదించండి
అర్ధంలేని సమేక్య వుద్యమంలో దొర్లిన ఆంధ్రా మేధావులారా
మాసీమ హక్కులంటూ వేదికలెక్కి తొడలు కొట్టిన పొరాట పీనుగలారా
లేవండి
దృతరాష్ట్ర పాలకుల వ్యాపారానికి బలికాబోతున్న
పచ్చటి కృష్ణా పరివాహకాన్ని రక్షంచండి
చరబడబోతున్న అందాల క్రిష్ణమ్మను కాపాడండి.
రైతులారా
అన్నం పెట్టే అమ్మలు మీరు
అభివృద్ధి పాలకులనే ఘర్ వాలాలకు మీ అమ్మతనాన్ని అమ్ముకోకండి
ఏలికలారా
పాలకులారా
మేధావులారా
అన్నీ తెలిసీ స్వలాభాలకు లాలూచీపడి మిన్నకుండిపొయారా
మరుజన్మంటూ వుంటే
కాడుపుకాలిన సామాన్యుడి అశుద్ధంలో
పురుగులై పుడతారు బడవల్లారా.(వుడుగుల వేణుకి క్షమాపనలతో)


చావును దాటలేని ఊహ 
వురేసుకున్న ప్రతిసారీ 
ప్రశ్నై పురుడుపోసుకుంటది 
జ్ఞానమో మోహమో 
భేతాళమై 
బ్రతుకునెప్పుడూ
భ్రమపెడుతూనే వుంటది.
ఓహో
నువ్వు స్త్రీవా ....?
ఐతే ...?

నీ రొమ్ములకేమైనా 
కొమ్ములు ఉన్నాయా
నీ గుండెకు కవాటాలు కాక
కోటగోడలేమైనా ఉన్నాయా
నీ మెదడులో ఆలోచనలు కాక
పారిజాతాలేమైనా పూస్తున్నాయా
నువ్వు కూడా
నాలాంటి మనిషివేగా.
దేహ వైరుధ్యమంటావా...

నీకున్నవి నాకు
నాకున్నవి నీకు
కొన్ని వుండవు
వుండవు గాక వుండవు.
నువ్వూ నేనూ
రెండుగా తుంచబడ్డ
అసమాన అర్థశరీరాలం.

అవి కౌగిలిలోనే పరిపూర్ణం
కలయికతోనే సంపూర్ణం
అదే ప్రకృతి సూత్రం
అర్థం చేసుకుంటే
అదే అర్ధనారీశ్వర తత్వం.
అద్యక్షా...
లంచం ఇవ్వడానికి ప్రభుత్వ ఋణం కోరచ్చా
వ్యబిచారానికి కొంత సబ్సీడీ అడగచ్చా
విటులకు ఒక రీహాబిలిటేషన్ హోం తెరవచ్చా
అద్యక్షా
కనీసం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
మీద ఒక అవిశ్వాస తీర్మానం పెట్టచ్చా....?

తెలిసినదేదో 
తెలియనట్లుగా
తెలియనిదేదో 
తెలిసినట్లుగా
వైఫల్యం 
సాఫల్యంగా
సాఫల్యం 
వైఫల్యంగా
అవ్యక్త వ్యక్తీకరణ
అక్షరాలకు పట్టుకున్న శాపంగా
సూత్రీకరణలో ఇమడని అంకెలను
హతమార్చిన సాపేక్ష సాక్షంగా
ఏదో ఏదో ఇంకేదో
భ్రమ స్వష్టాస్పష్టం.
ఆశకు ఆశాభంగానికి మద్య
కొంత
చావుకూ బతుక్కీ మద్య కూడా 

అంతే.