స్వప్నగ్రస్తుడి నిషిద్ధ స్వప్నం
అంతులేని ఇచ్ఛతో
స్వేఛ్చాయానం చేస్తున్న సాహసికుడ్ని...
ఎవరి విజయ గాధకో జేజేలు పలికే
సమూహమాత్రుడిగా మిగలకూడదని
కోరుకున్న ఒంటరితనంతో
ఊరేగుతున్న స్వాప్నికుడ్ని ...
దుఖాన్ని,విషాదాన్ని
వైరాగ్యంగా , వేదాంతంగా మలుచుకొని
వేకువను స్వప్నిస్తూ
కాళరాత్రినీ , కటిక చీకటినీ
చీల్చుకుంటూ సాగుతున్న బాటసారిని...
గాయమైతే గుండె నెత్తురు
కాంతి కాగాడాలకు తైలమౌతుందని నమ్మినవాడిని...
జలతారు కలల కోసం
కలనీ ,కళ్ళనీ తెగ”నమ్మిన” వాడిని...
“స్వప్నగ్రస్తుడ”న్నారు మిత్రులు…!
కొంప శిధిలమైతే గబ్బిలాల రొధ
స్వప్నం ధ్వంసమైతే సర్రియలిజాల వ్యధ
అవగతమౌతూనే ఉంది....యదాతథంగా.
కానీ ...
లేకి మాటల గలగలలతో
కాసుల చప్పుడు చెయ్యలేక
నా కలల మానవీయ ముడిదినుసులన్నీ
శిలాజాలుగా మిగిలిపోయ్యాయి.
ఇప్పుడు ...
ఎవడో కక్కిన ఎంగిలి స్వప్నాన్ని కొనసాగిస్తూ...
కళ్ళు చించుకున్నా సొంత స్వప్నం ఒక్కటీ కానరాక
స్వప్నభ్రష్టుడనై శయనించాను...
నాకూ తెరకు మధ్యనున్న చెలియలి కట్టను చిదిమేసి
నా కలల శిలాజాలను మొలకెత్తించే
గాడ వసంతం కోసం
నిషిద్ధ స్వప్నాన్ని
నా కనురెప్పల పైకి ఆవాహన చేసుకుంటూ
నిద్రుస్తున్నాను.
“సీనీరచయిత” అంటున్నారు నన్నిప్పుడు.
No comments:
Post a Comment