కదిలే వేళ్ళతో నడిచే మహావృక్షం కదా మనిషి
నీడనిచ్చి నలుగురి సేద తీర్చాల్సిన వాడు
నిలువెల్లా స్వార్ధం నింపుకుని విస్తరిస్తున్నాడేంటి ........?
నీడలో చెట్టు బ్రతకదని తెలిసీ
తన నీడను తనే ఆక్రమించుకుంటున్నాడేంటి..............?
ప్రతిఫలం ఆశించక ఫలాన్నీయాల్సిన వాడు
ప్రతి పనిలో లాభమెతుకుతున్నాడేంటి......................?
గట్టిగా చెప్పాలంటే పిడికెడు మట్టి కదా మనిషి
ఈ మట్టిలో మమేకమవ్వాల్సిన వాడు
నిలబడ్డ నేలంతా నాదే అన్న వెర్రి వ్యామోహంతో విర్రవీగుతున్నాడేంటి ...?
ఆకలి చావులకు ప్రేక్షకుడవుతూ
తన బొక్కసాలక్రిందున్న లెక్కలేనంత సంపదను సరిచూసుకుని నవ్వుతున్నాడేంటి......?
మనిషిలో దేవుడుంటే
మరి ఈ నేలతల్లి నరకానికి నకలుగా మారుతున్నదేంటి.....?
తన ఒడిలో సేదతీరమని మృత్యుదేవత ఆహ్వానిస్తే
ఆనందంగా అమ్మ ఒడి చేరక
భయవిహ్వాలుడై పారిపోతాడేంటి.....?
కానరాని గమ్యాల వెంట పరిగెడుతూ
ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతానంటాడేంటి ...?
సవాలక్ష ప్రశ్నలు
సమాధానమే లేని ప్రశ్నలు
తనను మింగేసిన చీకటిని చీల్చుకుని ఉదయించే సూర్యునిలా
ప్రశ్నలను ప్రశ్నలే మింగేసే అయోమయ సంఘర్షణ నుంచి
ఒక సత్యం ఉద్భవిస్తుందేమో.....!
పుడమితల్లిని చీల్చుకుని
ఓ స్వేఛ్చా స్వర్గం జన్మిస్తుందేమో.....
ప్రశ్నకు ప్రశ్నే జవాబౌతుందేమో.......!
No comments:
Post a Comment